విశాఖ జిల్లాలో టీడీపీ గెలుపుకు ఎంపీ అభ్యర్ధులే కీలకం
- 8 Views
- admin
- April 4, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అసెంబ్లీ అభ్యర్ధుల వైఫల్యం తేటతెల్లం———
గ్రామీణ ప్రాంతంలో ఆనంద్పైనే అందరి దృష్టి———————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖ జిల్లాలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధుల గెలుపు నకు ముఖ్యంగా ఎంపీ అభ్యర్ధులే కీలకమయ్యారు. గతంలో సిట్టింగ్ ఎమ్మేల్యులుగా పని చేసినప్పటికీ ప్రజల్లో ఆదరణ కరువైంది. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటునియోజక వర్గం పరిధిలో వున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎదురీత తప్పడంలేదు. ఒకటి రెండు స్థానాలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్లా ఎంపీ అభ్యర్థిపైనే ఆధారపడి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నియోజకవర్గాల వారిగా విశ్లేషణ చేయాల్సి వస్తే ఒక్క నర్సీపట్నం నియోజక వర్గంలో మాత్రమే మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రమే తన స్వంత కేడర్‌తో ముందుకు పోతున్నారు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యన్నారాయణ టీడీపీ తరుపున పోటీలో నిలవగా సమీప ప్రత్యర్ధులుగా వైసీపీ నుంచి గుడివాడ అమరనాథ్, జనసేన నుంచి పరుచూరి భాస్కరరావు బరిలో వున్నారు. ఇప్పటికే అవినీతి పరుడు, భూకబ్జాదారుడుగా నియోజకవర్గంలో ముద్ర పడి వున్నారు. ఇతని గెలుపు అనుమానమే అని భావించి అధిష్టానం చివరి వరకూ అభ్యర్థిని మార్చే పనిలో పడిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధు లిద్దరినీ ఎదుర్కొని గెలవడం కష్టమైన తరుణంలో విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్‌కుమార్‌ను ఎంపీగా అధిష్టానం నిలబెట్టడంతో పీలాకు కొండంత ధైర్యం వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ డాక్టర్ బంగారయ్యను పోటీకి నిలుపగా వైసీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం వున్న గొల్ల బాబూరావుని బరిలో నిలుపగా, జనసేన నుంచి నక్కా రాజబాబు పోటీలో వున్నారు.ప్రధాన ప్రత్యర్ధులైన వీరిద్దరినీ ఎదుర్కొని గెలవడం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బంగారయ్యకు అంత సులభం కాదు.యలమంచలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు టీడీపీ నుంచి పోటీకి నిలవగా వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, జనసేన నుంచి సుందరపు విజయకుమార్ బరిలో వున్నారు. ఇప్పటికే అవినీతి మరక అంటించుకుని గ్రూపురాజకీయాలకు తెరలేపిన పంచకర్లను ఈ దఫా ఇంటికి పంపేద్దాం అని స్థానిక ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాని ఎంపీ అభ్యర్ధి ఆనంద్ స్థానిక ఎలమంచలి వాసి కావడంతో పంచకర్ల గెలుపుకు అవకాశం ఏర్పడింది. పెందుర్తి నియోజక వర్గంలో సీనియర్ నేత బండారు సత్యన్నారాయణ మూర్తి టీడీపీ నుంచి పోటీకి నిలవగా వైసీపీ నుంచి యువకుడు అదీప్ రాజ్ పోటీలో వున్నారు. బండారు తనయుడు అప్పలనాయుడుపై కబ్జాదారుడు, సెటిల్ మెంట్ల దిట్ట అని పేరు సంపాదించేశాడు. ఈసారి వైసీపీ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో ఆడారి ఆరంగేట్రంతో వైసీపీకి మింగుడు పడడంలేదు. మాడుగుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గవిరెడ్డి రామానాయుడు ఓటమికి పూర్తి కారణం ఆడారి తులసీరావేననేది జనమెరిగిన సత్యం .అయితే ఈసారి ఎన్నికల్లో తులసీరావు తనయుడే ఎంపీ అభ్యర్ధి కావడంతో గవిరెడ్డి గెలుపు నల్లేరుమీద నడకేనని అంటున్నారు. మాడుగులలో సిట్టింగ్ అభ్యర్ధి బూడి ముత్యాల నాయుడుకే ఆ పార్టీ మరలా టికెట్ కేటాయించింది. అయితే నియోజకవర్గంలో చెప్పుకునేంత అభివృద్ది చేయకపోవడంతో ఈసారి గెలుపు గవిరెడ్డిని వరించే అవకాశం వుంది. చోడవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే పరిస్థితి లేదని చివరి వరకూ అధిష్టానం వేరే వ్యక్తికి టికెట్ కేటాయించే పనిలో పడింది. అయితే ధీటైన అభ్యర్ధి దొరకక పోవడంతో మరలా రాజుకే టికెట్ యిచ్చారు. అయితే ఇక్కడ గత రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన కాపు సామాజిక వర్గానికి చెందిన కరణం ధర్మశ్రీని గెలిపించుకోవాలని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చిన తరుణంలో అనూహ్యంగా టీడీపీ ఎంపీ ఆడారి ఆనంద్‌కుమార్ కావడంతో సులభంగా గెలిచేద్దాం అని భావించిన దర్మశ్రీని కష్టపడేలా చేసింది. ఈ నియోజకవర్గాలలో ఆడారి తులసీరావుకి పాల రైతులతో గత కొన్నేళ్ళుగా విడదీయరాని బంధం వుంది. పార్టీలకతీతంగా ప్రతి గ్రామంలో అనుచరగణం వుంది. ఖర్చకు వెనకాడని ఆర్థికస్తోమత వుంది. ఓడిపోతారనుకునే ఎమ్మెల్యే అభ్యర్ధిని గెలిపించగలిగే వ్యవహారశైలి వుంది. పటిష్టమైన రాజకీయం చేయగలిగే అనుభవం వుంది. అంగబలం, అర్ధబలం, సామాజిక బలం, స్థానికత, ఇలా అన్నీ కలబోసి వున్న తులసీరావు తనయుడు ఎంపీ అభ్యర్ధి కావడం ఎమ్మెల్యే అభ్యర్ధులకు వరంగానే చెప్పుకోవాలి. చోడవరం రాజుకు వ్యతిరేకంగా వున్న పినపోలు వెంకటేశ్వర్లు, సీతా వెంకటరమణ వంటి వారి నుంచి అసమ్మతి సెగలు వున్న నేపథ్యంలో ఇప్పటికే అందరినీ ఒక గొడుగు కిందకి తెచ్చేశారు. మాడుగులలో గవిరెడ్డి, ఆడారి వర్గీయులు ప్రచారంలో సమన్వయంతో పని చేస్తున్నారు. అర్బన్‌లో చూసుకుంటే తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ నుంచి పోటీలో వుండగా వైసీపీ నుంచి అక్కరమాని విజయనిర్మల, జనసేన నుంచి కోన తాతారావు బరిలో వున్నారు. ఉత్తరంటీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి కెకెరాజు, జనసేన నుంచి పసుపులేటి ఉషా కిరణ్ బరిలో వున్నారు. దక్షిణంలో టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్‌కుమార్, వైసీపీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాసరావు, జనసేన నుంచి గంపా గిరిధర్ పోటీలో వున్నారు. పశ్చిమ నుంచి టీడీపీ గణబాబు, వైసీపీ నుంచి మళ్ళ విజయప్రసాద్, సీపిఐ నుంచి జెవి సత్యన్నారాయణ బరిలో వున్నారు. ఈ నలుగురు అభ్యర్ధులకు కొంత వ్యక్తిగత క్యాడర్ వున్నప్పటికీ ఎంపీ అభ్యర్ధి గీతం మూర్తి మనవడు, బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కావడంతో గెలుపు అవకాశాలకు దగ్గరగా వున్నారు. గాజువాక, భీమిలీ చూసుకుంటే ఎంపీ అభ్యర్ధి అవసరం పూర్తి స్థాయిలో కనపడుతోంది. భీమిలిలో వైసీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్‌పై ధీటైన అభ్యర్ధిని పోటీలో పెట్టడానికి టీడీపీ చివరి వరకూ ప్రయత్నం చేసింది. చివరి నిముషంలో సబ్బం హరికి కేటాయించింది. ఇక్కడ అవంతిని తట్టుకోవడం హరికి కత్తిమీద సాములాంటిదే. ఇలాంటి తరుణంలో ఎంపీ అభ్యర్ధి అండ పుష్కలంగా దొరికిందనే చెప్పుకోవాలి. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్పౖౖె జనసేన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీలో నిలవడం, వైసీపీ నుంచి జగన్ చరిష్మా, నవరత్నాల అమలు వంటి నినాదంతో తిప్పల నాగిరెడ్డి బరిలో నిలిచారు. దీనితో టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధికి ఎంపీ అభ్యర్ధి అవసరం పూర్తి స్థాయిలో వుందనే చెప్పుకోవాలి. గిరిజన ప్రాంతంలో వున్న అరుకు పార్లమెంటు నియోజకవర్గంలో వున్న అరుకు, పాడేరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చినవారే. అరుకు నుంచి కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌కుమార్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి శెట్టి ఫాల్గుణ పోటీలో వున్నారు. పాడేరు నుంచి టీడీపీ గిడ్డి ఈశ్వరి, వైసీపీ నుంచి కె భాగ్యలక్ష్మీ బరిలో వున్నారు. వీరిద్దరూ కూడా ఎంపీ అభ్యర్ధి కిషోర్ చంద్రదేవ్పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు. మిగిలిన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జనజాగృతి తదితర అభ్యర్ధులతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో నిలిచారు. వీరందరూ ఓట్లు చీల్చే అవకాశం వుంది. వీటన్నింటినీ అధిగమిస్తూ ఈ ఎన్నికల్లో మరలా టీడీపీ గెలవాలంటే ఎంపీ అభ్యర్ధులే కీలకమని చెప్పుకోవాలి. ఏమి జరుగబోతుందో వేచి చూద్దాం.


