విశాఖ ఓటరూ ఆలోచించుకో !
- 13 Views
- admin
- April 9, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
పేదవాడిఆయుధం ఓటు మాత్రమే————————
దేశగతిని మార్చేదీ నీ ఓటే !——————–
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకం—————————–
ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలక మైనది. పేదవాడికి వున్న ఏకైక ఆయుదం ఓటు మాత్ర మే. దేశం వృద్ధి చెందాలన్నా, ప్రపంచ దేశాల్లో భారత దేశం ఉన్నతిని కాపాడాలన్నా, విద్యావ్యవస్థ అభివృద్ధి చెంది శతశాతం మేధావులుగా తయారు కావాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు కావాలన్నా, పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎదగాలన్నా నాయకత్వం సరియైనదై వుండాలి. నాయ కుడు నీతివంతుడై, పాలనాధక్షుడై వుండాలి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి.
నిర్మించాలి. ఇవన్నీ జరగాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యపాలన వుంది కావున ఎన్నికల ద్వారా నాయకుడిని ఎన్నుకుంటాం. ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి అందరికీ ఆ నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. ప్రతి ఓటరు ఓటు విలువ తెలుసుకుని సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకుంటే దేశం పురోగాభివృద్ధి సాధిస్తుంది. అయితే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలలో వున్న నాయకులు వారి పాలన, చేసిన అవినీతి, మాటతప్పిన విధానాలను పరిశీలన చేస్తే విశాఖ జిల్లా వరకూ చూసుకుంటే బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు, టీడీపీ, వైసీపీ, జనసేన, జనజాగృతి వంటి పార్టీల అభ్యర్ధులు పోటీలో నిలిచారు.ఈ పార్టీలు అధికారంలో వుండగా ప్రజలకు ఏమి చేశారు, అధికారం కోసం తపిస్తున్న వారి పరిస్థితులేంటి అనేవి చూద్దాం. బీజేపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖలో నరేంద్రమోడీ ప్రకటించిన రైల్వేజోన్ విషయంలో వాల్తేరు డివిజన్ తీసేసి, జోన్ ప్రకటించడం అధిక ఆదాయం వచ్చే కేకే లైన్‌ని ఒరిస్సాకి అప్పగించారనే అపవాదు వుంది. దీనివలన ఒరిగే దేమిలేదని, ఆదాయ వనరులుంటేనే రైల్వే బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడం జరుగుతుందని తద్వారా ఉద్యోగవ కాశాలొస్తాయని స్థానికులంతా జోన్ ఇవ్వమని పోరాటాలు, ఉద్యమాలు చేశారు. కాని జోన్ ఇచ్చినప్పటికీ విశాఖ వాసులకు అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. ఇకపోతే కేంద్రీయ సంస్థలైన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్, స్టీల్‌ప్లాంట్ వంటి సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నించడం. హెచ్పీసిఎల్ను ఇప్పటికే ప్రైవేటు పరం చేయడం దాన్ని మూసేయడం కూడా జరిగిపోయింది. బీజేపీ ఎంపీగా కంభంపాటి హరిబాబుని గెలిపిస్తే విశాఖకు ఆయన చేసింది శూన్యంగానే చెప్పాలి. అలాగే నరేంద్రమోడీ రాఫెల్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వలన సామాన్యు లకు పన్నుల భారం, నోట్ల రద్దు వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం తదితర అంశాలను బీజేపీ విషయంలో ఓటరు బేరీజు వేసుకోవాలి. కాంగ్రెస్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభిజించారనే కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంకా పోలేదనిపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్ జెండాను మోసిన నేతలే ఇక మేము మోయలేమంటూ వేరే పార్టీలకు వలస పోయిన పరిస్థితి. దేశస్థాయిలో చూసుకుంటే బొగ్గు, గడ్డి, టెలికాం వంటి 18 కుంభకోణాలతో కాంగ్రెస్ నేతలంతా అవినీతి మయంలో కూరుకుపోయారు. దేశ ఆర్ధికవ్యవస్థను భ్రష్టుపట్టించింది కాంగ్రెస్‌నేతలే అని చెప్పక తప్పదు. వాద్రా వంటివారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే వున్నారు. కేవలం రాజకీయ స్వార్ధప్రయోజనాలకోసమే రాష్ట్రాన్ని రెండుగా విభజిం చారనే వాదన ప్రజల్లో బలంగా వుంది. వామపక్ష పార్టీలు ప్రశ్నించడానికి తప్ప పాలించడానికి పనికిరానివిగా వున్నాయి. ఆయా పార్టీలలో నేతలంతా అసమర్ధులనే భావన ప్రజల్లో వుంది. ఉద్యమాల పేరిట ఎర్రజెండాలు పట్టుకుని తిరుగుతూ కార్మిక, కర్షక వర్గాల వారిని ఉద్యమాల పేరిట కొంతమంది నేతలు ప్రేరేపించినా తగిన న్యాయం ప్రజలకు జరగదని ప్రతి ఎన్నికల్లో ప్రజలు వీరికి ఓట్ల రూపంలో తెలుపుతూనే వున్నారు. ప్రాంతీయ పార్టీలుగా వున్న టీడీపీని చూసుకుంటే గడిచిన అయిదేళ్ళలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా సిఎస్లుగా పని చేసిన అజేయ్ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావు వంటి ఐఏఎస్ అధికారులు లెక్కలతో సహా ప్రజలకు తెలిపారు. టీడీపీ వారు చేసిన ఇసుక మాఫియాకి గానూ గ్రీన్ ట్రిబ్యునల్ వందకోట్ల జరిమానా విధించిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. కాదేదీ కరప్షన్‌కి అనర్హం అన్నట్లుగా ప్రతిచోటా అవినీతే. ప్రతీ విభాగంలోనూ దందాలే. విశాఖ వరకూ చూసుకుంటే సిట్ సమర్పించిన నివేదికలో టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యన్నారాయణపై ఎఫ్ఐఆర్ కూడా వేశారు. అసెంబ్లీలో సిట్ నివేదికను తెరుస్తారు. దానిలో ఎవరెవరూ వున్నారు. విచారణ చేస్తే టీడీపీ నేతలు ఎంతమంది బయటికి వస్తారు అని ప్రజలంతా ఎదురుచూసిన తరుణంలో దాన్నికాస్త మూసేశారు. ఆ నివేదిక ఎక్కడ వుందో కూడా తెలియని పరిస్థితి. లక్షకోట్ల రూపాయిలు విలువచేసే భూములను కబ్జా చేశారనే ఆరోపణలైతే వున్నాయి. అభివృద్ధి పేరిట కనీస అర్హతలు లేని లూలూ కంపెనీకి సుమారు రూ.950 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన ఏపీఐఐసీ స్ధలాన్ని కట్టబెట్టడం. ఇంకా చాలదన్నట్టు సీిఎంఆర్కు చెందిన విశ్వప్రియా ఫంక్షన్ హాలును తీసుకోవడానికి నగరంలో అత్యంత విలువైన భూములను సీఎంఆర్కి కట్టబెట్టడం. దానికి అయ్యే రిజిస్ట్రేషన్ల ఖర్చు సుమారు రూ.170 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించడం, ఒక ప్రైవేటు సంస్థకి అభివృద్ధి పేరిట స్థలం ఇవ్వడానికి మరో ప్రైవేటు సంస్థ వద్ద స్థలాన్ని తీసుకుని ఇలా కట్టబెట్టడం బారతదేశ చరిత్రలోనే ప్రధమంగా జరుగుతోందని అప్పట్లో విశాఖ వాసులు గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాధుడేలేడు. సాయిప్రియా రిసార్ట్సు ఆనుకుని వున్న ప్రేమసమాజానికి చెందిన సుమారు 48 ఎకరాల స్థలాన్ని టీడీపీ అండదండలతో సాయిప్రియా రిసార్ట్సు అధినేత లీజుపేరిట దోచుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి ఎండోమెంట్ ఈవో పుష్పవర్థన్ని బెదిరించి ప్రేమసమాజం కమిటీ సభ్యులను స్థలంలో నుంచి దౌర్జన్యం గా వెనక్కి పంపించారనే ఆరోపణలున్నాయి. ఆదానీగ్రూప్కి అభివృద్ధి పేరిట 175 ఎకరాలు కేటాయించడంపై క్విడ్‌ప్రోకో విధానంలో కోట్ల రూపాయిల డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు బలంగా వున్నాయి. నీరు చెట్టు పథకం క్రింద టీడీపీ నేతలంతా దోచేసుకున్నారనేది జగమెరిగిన సత్యం. విశాఖ నగరాన్ని, చుట్టుప్రక్కల భూముల్ని అవినీతి పేరిట దోచేశారనేది టీడీపీపై వున్న ప్రధాన ఆరోపణలు. వైసీపీ విషయానికొస్తే పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డే అఫిడివిట్లో తనపై 31 కేసులున్నాయని దాఖలుచేసిన దౌర్భాగ్య స్థితి. ఒక్క కేసో, రెండుకేసులో అయితే ఉద్దేశ్యపూర్వకంగా పెట్టారను కుందాం. ఏకంగా 31 కేసులు ఎదుర్కొంటున్న నేత ముఖ్యమంత్రి రేసులో వున్నారంటే ఓట్లేసే ప్రజలే ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్మోహనరెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తీవ్రమైన ఆర్ధికనేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. సెజ్‌ల పేరిట ప్రభుత్వ భూములను కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టి కోట్ల రూపాయిలు జగన్మోహనరెడ్డి కంపెనీలకు దారి మళ్ళాయనే ఆరోపణలున్నాయి. గనులశాఖలో అవకతవకలకు సంబంధించి ఐఏఎస్ అధికారులు కూడా జైలుకు వెళ్ళిన పరిస్థితిని ఆంధ్రా ప్రజలంతా చూశారు. అయితే గత విషయాలను, వైఫల్యాలను పక్కనపెట్టి తనకి ఒక్క అవకాశమిస్తే సుస్థిరపాలన అందిస్తానని ఆంధ్రా ప్రజలకు హామీ ఇస్తుండటంతో కొంతవరకూ ఓటరును ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ తరుపున పోటీచేసే అభ్యర్ధులలో కొంతమందిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఆర్ధికనేరాలకు పాల్పడినట్లు కోర్టులో కేసులు కూడా వున్నాయి. వీటన్నింటినీ గమనించి ఓటరు నిర్ణయం తీసుకోవలసిన స్థితి నెలకొంది. ఇక జనసేన విషయానికొస్తే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి దిశానిర్ధేశం చేసే స్థాయిగానీ, అడ్మినిస్ట్రేషన్ చేయగల సత్తాగాని లేదని మేధావుల్లో ఒక భావన ఏర్పడింది. ఈమద్యకాలంలో అయితే టీడీపీకి అమ్ముడు పోయారనే ప్రచారం కూడా ఎక్కువగా వుంది. ప్రజలకు మేలుచెయ్యాలనే తపనతో ఆవేశంగా పనిచేస్తున్నారు తప్ప ఆలోచన లేదనేది ప్రజల్లో వున్న భావన.
అరుకు ఎంపీగా పనిచేసి ఇప్పుడు జనజాగృతి పార్టీని స్థాపించి పోటీలో నిలిచిన కొత్తపల్లి గీత తన భర్త వ్యాపార లావాదేవీల్లో సమస్యల్లో ఇరుక్కుని హైదరాబాదులో భూములు కబ్జాచేశా రని, ఇప్పుడు కూడా పార్టీ పెట్టింది టీడీపీ అధినేత ఆదేశాలతోనే అని, గెలిచే పార్టీల ఓట్లు చీల్చేందుకే అభ్యర్ధులను బరిలో నిలిపారనే ఆరోప ణలు బలం గా వున్నాయి. ఒక నియోజకవర్గంలో తన పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి పోటీనుంచి తప్పుకుని వేరే పార్టీకి మద్దతు తెలపడానికి బేరం పెట్టారని కూడా తెలు స్తోంది. ఏదిఏమైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్ళకొకసారి సామాన్య మానవుడికి దొరొకే ఆయుధం పవిత్రమైన ఓటు మాత్రమే. ప్రతి ఒక్కరూ మెరుగైన సమాజం కోసం నిజాయితీగల అభ్యర్ధులను ఎన్నుకుని దేశ ప్రగతికి పాటు పడా లని మేధావుల ఆశాభావం. ఏమేరకు ఓటరు విజ యం సాధిస్తాడో వేచి చూద్దాం.


