పాపం అభ్యర్ధులు
- 10 Views
- admin
- April 10, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
బరిలో ఎంతోమంది వున్నా గెలిచేది ఒక్కరే————-
మిగిలినవారి పరిస్థితి అగమ్యగోచరం——————–
—————–గోగుల శ్రీనివాసరావు, బ్యూరో చీఫ్, ఫీచర్స్ ఇండియా—–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సార్ధం నాకేశారు. మొత్తం పిండేశారు. ఎవర్నో అనుకునేరు. ఈసార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీలో వున్న అభ్యర్ధులని. గతంలో ఎన్నికలొస్తే చందాలు వేసుకుని అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చులకు నిధులు సమకూర్చేవారు. నాయకులు కూడా విధేయతతో గెలిచిన తరువాత ప్రజలకు న్యాయంగా సేవ చేసేవారు. ఇప్పుడు రోజులు మారాయి. ఎవరి అవకాశం వారిది. గెలిచిన తరువాత నాయకులు దోచుకుంటే ఎన్నికల సమయంలో రాకరాక అయిదు సంవత్సరాలకొకసారి ఎన్నికలు రావడంతో దళారీలు, మధ్యవర్తులు, పీఆర్వోలు, ఓటర్లు, స్వచ్ఛందసంస్థల వారు, చర్చిఫాదర్లు, కులపెద్దలు, వార్డు గ్రామస్థాయి నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఒకరుకాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరికీ అభ్యర్ధే టార్గెట్. ఎవడు దొరుకుతాడు ఎంతకి దొరుకుతాడు. ఇదే నినాదంతో అందరూ ప్రచారంలో హడావిడి చేశారు. ఆ పార్టీ, ఈ పార్టీల వారనిలేదు. ఏపార్టీ అభ్యర్ధి వచ్చినా మేము మీ వారమే, మా ఓట్లు మీకే అన్ని నమ్మబలికి అభ్యర్ధి ఆర్ధిక సామర్ధ్యాన్ని బట్టి దోచేయడమే. అందరి అభ్యర్ధుల వద్ద డబ్బు తీసు కున్నా ఓటరు మాత్రము ఒక్కరికే ఓటు వేయగలడు. ఆ వేసే ఓటు నాకే వేయొచ్చు కదా అనే నమ్మకంతో అభ్యర్ధు లంతా వారికి చేతనైన చెల్లింపులు చేసి ఓట్లు కొనుగోలు చేసేశారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా వున్న పదిహేను అసెంబ్లీ నియోజక వర్గాలు, మూడు పార్లమెంటు స్థానాలకు గానూ ప్రధానంగా సుమారు 80 మంది పోటీలో వున్నారు. వీరందరూ కలిసి సుమారు వెయ్యి కోట్లరూపాయిలు పంపిణీ చేసి వుండవచ్చ అనే అంచనాలు వున్నాయి. ఒక నియోజక వర్గంలో సుమారు 2.5లక్షల ఓటుకు కనీసం వెయ్యి రూపాయిలు చొప్పున ప్రతి అభ్యర్ధి పంపిణీ చేసి ఓట్లకు గాలం వేశారు. కొన్ని చోట్ల రెండు, మూడువేల రూపాయిలు మరికొన్నిచోట్ల తప్పదు అనుకున్న ప్రాంతాల్లో ఓటుకి అయిదువేల రూపాయిలు కూడా ఇచ్చి ఓట్లు కొనుగోలు చేశారు. ప్రచారం చివరిరోజు మంగళవారం ప్రతి అభ్యర్ధి కార్యాలయం వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చినవారితో ప్రాంగణమంతా నిండిపోయింది.పండుగ వాతావరణం కనబడింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి మంగళవారం వరకూ అభ్యర్ధుల కంటిమీద కునుకులేదు. మాట్లాడటానికి ఓపికలేదు. డబ్బులు పంపిణీచేయడానికి తీరిక లేని పరిస్థితి నెలకొంది. ప్రతిపూట సమయానికి భోజనం చేశారా అన్నది అనుమానమే. గతంలో నేతలుగా పనిచేసిన వారికి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనిపించి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారి పరిస్థితి విరుద్దంగా వుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీగా ప్రజాసేవ చేద్దామనుకునేవారికి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామురా బాబూ అనిపించేశారు ఈ దళారులు. అభ్యర్ధులైతే నిజాయితీగా సేవ చేద్దామని వచ్చారా స్వప్రయోజనాలకోసం వచ్చారా అని ప్రక్కనపెడితే నిజాయితీగా అన్నివర్గాల వారికి న్యాయం చేశారనే చెప్పాలి. అయితే అవి దళారీలు, మధ్యవర్తులు, పీఆర్వోల వద్ద వుండి పోయాయా ? చివరివరకూ చేరాయా ? అనే దానిపై అభ్యర్ధుల గెలుపోటములు ఆదారపడి వున్నాయి. విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా పోటీలో వున్న ఎంవీవీసత్యన్నారాయణ అయితే మీడియా సాక్షిగా వేదన చెందారంటే అభ్యర్ధుల పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు. నీతి నీజాయితీ, నిబద్దతలు కనీసం కూడా లేకుండా ఇలా కూడా వుంటారా మనుషులు అని ఈ ప్రచార సమయంలోనే ఆయన చూసేశారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి పదివేల మందికి వెయ్యిరూపాయిలు చొప్పున కోటిరూపాయిల నగదు, కోటిరూపాయిల మద్యం ఇస్తానని నమ్మబలికి ప్రచారం ముగిసే సమయానికి చేతులేత్తేస్తే ఈ ఎంపీ అభ్యర్ధి మాత్రము ఏమి చేయగలడనే వాదన కార్యకర్తల్లో బలంగా వినిపిస్తోంది. అతని వెంటే వుంటూ ముఖ్య అనుచరుడిగా చలామణీ అవుతూ, పాపం ఎంవీవీ పూర్తిగా ముఖ్యవ్యవహారాల్లో ఆయన్నే నమ్మినట్లుంది. ఈఎంపీ ఎన్నికల బాద్యతలు మనకే అప్పగిస్తారు దొరికినంత దోచేద్దామని ముఖ్య అనుచరుడు తన మిత్రునితో చెప్పడం ఎంతో నమ్మకద్రోహానికి నిదర్శనం. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి విశాఖకు వచ్చి స్థిరాస్తీ వ్యాపారం చేసుకుని చాలినంత సంపాదించుకుని ఇప్పుడు ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు తొలిదశలోనే చేదు అనుభవమే ఎదురైంది. రాజకాయాల్లోకి ఎందుకువచ్చామా అని పునరాలోచించుకునే పరిస్థితి వచ్చింది. మరో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కెకె రాజు నిజాయితీకి నిలువుటద్దం. మాటిచ్చాడంటే ప్రాణంపోయేంతవరకూ జవదాటని వ్యక్తిత్వం. జగన్మోహనరెడ్డి మీద వున్న అభిమానంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఈప్రచారదశలోనే ఆయననోటివెంటే మాకెందుకండి ఈ రాజకీయాలు.భవిష్యత్తులో ప్రత్యక్షరాజకీయాల్లోకి రాను. గెలిచినా ఓడినా ఇవే నాచివరి ఎన్నికలు. వైసీపీ పార్టీకి సేవచేస్తా. జగన్మోహనరెడ్డి ఏబాద్యత అప్పగించినా చేస్తాను తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అనిపించేలా చేశాసారి ఓటర్లు, దళారీలు. ఒక్కో నియోజకవర్గంలో స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్ధులను ప్రక్కన పెడితే ప్రధానంగా అయిదుగురు అభ్యర్ధులు బరిలో వున్నారు. ఒక్కో అభ్యర్ధికి సుమారు రూ.25కోట్ల రూపాయిల వరకూ ఖర్చు అయివుంటుంది. అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌కుమార్, విశాఖ పశ్చిమ టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు, యలమంచిలి వైసీపీ అభ్యర్ధి కన్నబాబురాజు వంటి వారు ఎన్నికోట్లు ఖర్చుచేసినా పరవాలేదు. ఆర్ధికంగా స్థితిమంతులుగా వున్నారు. ఎన్నికలకు ఖర్చుచేసేంత డబ్బు లేక అరకొర స్థోమతతో టికెట్ తెచ్చుకుని ప్రచార సమయానికి వున్నదంతా వూడ్చేసుకుని ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఏమి చేయాలో తెలియని చోడవరం వైసీపీ అభ్యర్ధి కరణం దర్మశ్రీ, పాయకరావుపేట జనసేన అభ్యర్ధి నక్కారాజుబాబు వంటి అభ్యర్ధుల సంగతేంటని ఆలోచన చేస్తే భవిష్యత్తులో కొత్తగా ఎవ్వరూ రాజకీయాల్లోకి రావాలనే సాహసం చెయ్యరు. ఏదిఏమైనా డబ్బులు వెదజల్లింది అయిదుగురు అయినా గెలిచేది ఒక్కరే. మిగిలిన ఆర్ధిక స్థోమత లేని అభó్యర్ధుల జీవితాలు అగమ్యగోచరమే. ఎవరైనా అభ్యర్ధి నిజాయితీగా వుంటూ గెలిచేస్తాము అని బేరేజు వేసుకుని చివరికి మే 23 తేదీన ఫలితాల్లో ఓటమి చవిచూస్తే అది కేవలం దళారుల వ్యవహార శైలి వలనే ఓడిపోయినట్లవుతోంది. అభ్యర్ధుల వైఫల్యము కాదనేది విశ్లేషకుల అంచనా.


