విశాఖ తూర్పు తీర్పు విలక్షణం!
- 14 Views
- admin
- April 10, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
——–కీలక ప్రభుత్వ శాఖలు ఉన్న ప్రాంతం————-
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: విశాఖ పట్నం నగర పరిధిలో నియోజక వర్గాల పునర్విభజన జరగకము ందు విశాఖ-1, విశాఖ-2 నియోజ కవర్గాలు ఉండగా, నగర జనాభ పెరుగు తున్న కారణంగా విశాఖ-1,2 నియోజక వర్గంలోని కొన్ని ప్రాంతాలతో సహా పెందుర్తి నియోజక వర్గంలోని కొన్ని వార్డులను కలపి విశాఖ తూర్పు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. నగరానికి ఈశాన్య భాగంలో ఏర్పడిన తూర్పు నియోజకవర్గం విశాఖనగరంలోనే ప్రత్యేకమైనదిగా, కీలక ప్రాంతంగా గుర్తింపు పొందింది.
తూర్పు ప్రత్యేకత: విశాఖ నగరం విస్తరించక ముందే ఉన్న గ్రామాలతో పాటు కొత్తగా వెలసిన కాలనీలతో ఉన్న ప్రాంతం తూర్పు నియోజకవర్గం. తూర్పులో సముద్ర తీరం, చారిత్రాత్మక ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆసియాలోనే అతిపెద్ద టౌన్షిప్లలో ఒకటైన ఎంవీపీ కాలనీ, రాష్ట్రంలో అతిపెద్ద నగరాభివృద్ది సంస్ధ వీఎంఆర్డీఏ, హెల్త్ సిటీ, అనేక విద్యాసంస్ధలు, ప్రముఖ సంస్ధలు ఉన్న ప్రాంతం. మద్దిలపాలెం, వెంకోజీపాలెం, రేసపువానిపాలెం, పెదవాల్తేరు, చినవాల్తేరు, పెదజాలారిపేట, శివాజీపాలెం తదితర గ్రామాలన్నీ ఏళ్ల తరబడి ఉన్నవే. ఇక తరువాత కాలంలో ఏర్పడిన ఎంవీపీ కాలనీ 421 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీంతో పాటు పాండురంగాపురం, సీబీఎం కాంఫౌండ్, బాలాజీనగర్, కిర్లంపూడి లే అవుట్, ఈస్ట్పాయింట్ కాలనీ, మంగాపురం కాలనీ, డాక్టర్స్ కాలనీ, పిఠాపురం కాలనీ, లాసన్స్ బే కాలనీ, హనుమంతవాక, చినగదిలి, ఆరిలోవ, సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలు నెమ్మదిగా విస్తరించాయి. ఈ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారు ఎక్కువమంది ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నత వర్గాలు, విద్యావంతులు ఎంత మంది ఉన్నారో, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు కూడా అంతే సంఖ్యలో ఉండడం విశేషం.
సామాజిక వర్గాల ప్రభావం: నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో యాదవులు ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 40 నుంచి 42 వేల మంది యాదవులు ఉంటారు. ఆ తరువాత మత్స్యకారులు 26 వేల నుంచి 30 వేల పైచిలుకు, రెడ్డిలు 20 వేల మంది, కాపులు సుమారు 18 వేల మంది ఉంటారు. కమ్మలు, బ్రాహ్మణులు, ఎస్సీలు, శెట్టిబలిజ, గవర, ముస్లిం ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే తూర్పు ఏర్పడక ముందు, తరువాత ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఎన్నికల్లో ఎక్కువ సార్లు విజయం సాధించినా, మరికొన్ని సార్లు ఇతర సామాజిక వర్గాలు వారు విజయం సాధించారు. దీన్ని బట్టీ కుల సమీకరణాలు పెద్దగా ప్రభావం చూపలేదని అర్ధమవుతోంది. కానీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి వచ్చిన ఓట్లు, నిలచిన స్ధానం చూస్తే ఈ నియోజకవర్గంలో అభ్యర్ధి గెలుపు ఓటములపై ఖచ్చితంగా యాదవ ఓటర్లు ప్రభావం చూపుతారని స్పష్టం. అందుకనే రాజకీయ పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువగా ఇక్కడ టిక్కెట్టు కేటాయిస్తుంటారు.
మహిళా ఓటర్లే ఎక్కువ: విశాఖ తూర్పు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా మేరకు తూర్పులో 2,31,916 మంది ఉండగా, వారిలో పురుషుల కంటే స్త్రీలు 1310 మంది ఎక్కువ. 2014లో 2,45,366 మంది ఓటర్లు ఉండగా, ఈ ధఫా 14వేల ఓట్లు తగ్గాయి.
ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల వివరాలు:
మొత్తం ఓటర్లు 2,31,916
పురుషులు 1,15,296
స్త్రీలు 1,16,605
ఇతరులు 15
నియోజక వర్గం పేరు: విశాఖ తూర్పు
రిజర్వేషన్ : జనరల్
అసెంబ్లీ పరిధి ప్రాంతాలు
విశాఖ అర్భన్లో: 7,8,10,15,11,16,17,18,19 వార్డులు. విశాఖ రూరల్ పరిధిలో: 1,2,3,6 వార్డులు


