ఇక ఫలితాల కోసం 42 రోజులు ఆగాల్సిందే
- 13 Views
- admin
- April 12, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
——ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా———–
ఇటీవల విరామం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్.. పోలింగ్ ముగిసిన తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇలా సేదతీరారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. ఇరవై రాష్ట్రాల్లోని 91 లోక్సభ స్థానాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ సమాప్తమైంది. ఈ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్నది తెలియాలంటే మే 23 వరకూ అంటే ఇంకా 42 రోజులపాటు వేచిచూడాల్సిందే.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఇవే. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 11న పూర్తవ్వగా.. 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మరో ఆడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అంటే, తొలి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల ప్రజలు, అభ్యర్థులు ఫలితాల కోసం 42 రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.
తొలిసారి ఎన్నికలకు 4 నెలలు
స్వతంత్ర భారత దేశంలో 1951- 52లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు 68 దశల్లో పోలింగ్ జరిగింది. అంటే, ఎన్నికలు పూర్తవడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది. దేశంలో తొలి ఎన్నికలు కావడం వల్ల ఏర్పాట్లు చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది.
ఆ తర్వాత 1962 నుంచి 1989 మధ్య కాలంలో జరిగిన ఎన్నికలు నాలుగు నుంచి 10 రోజుల్లో పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అత్యంత తక్కువ వ్యవధిలో ఎన్నికలు పూర్తయింది 1980లో జరిగిన లోక్సభ ఎన్నికలు మాత్రమే. అప్పుడు పోలింగ్ ప్రక్రియ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తయింది. 2004 ఎన్నికలకు 21 రోజులు, 2009లో 28 రోజులు, 2014లో 36 రోజులు పట్టింది. ఇప్పుడు అంతకు మించి వేచిచూడాల్సి వస్తోంది.
శాంతి భద్రతలే కారణమా?
90వ దశకానికి ముందు ఎన్నికల్లో అవతకవకలపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండేవి. ఎన్నికల్లో పారదర్శకతపై విమర్శలు వ్యక్తమవుతుండేవి. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. హింసాత్మక దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారని, అధికార పార్టీల నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తుండేవి.
అయితే, 1990ల్లో ఎన్నికల కమిషనర్గా టీఎన్ శేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర పారామిలిటరీ బలగాలను వినియో గించడం ప్రారంభించారు. తర్వాత ఎన్నికలు జరిగేటప్పుడు భద్రతా బలగాలు అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా సూచించింది.
”ఎన్నికల ప్రక్రియకు ఎక్కువ రోజులు పట్టడానికి ప్రధానమైన కారణం శాంతిభద్రతల పరిరక్షణే. స్థానిక పోలీసులు కొందరు నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న భావన ఉండేది. దాంతో, మేం కేంద్ర బలగాలను మోహరించాల్సిన అవసరం వచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరిగితే అంతటా బలగాలను మోహరించడం సాధ్యం కాదు. కాబట్టి, దశలవారీగా పోలింగ్ నిర్వహిస్తూ.. ఒక ప్రాంతంలో ముగిసిన తర్వాత అక్కడి నుంచి మరోచోటుకు బలగాలను తరలిస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది” అని మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ గతంలో బీబీసీతో చెప్పారు. దేశ సరిహద్దుతో పాటు, వేర్వేరు ప్రాంతాల్లో భద్రతను చూసే వేలాది మంది భద్రతా సిబ్బందిని బస్సులు, రైళ్లలో పోలింగ్ జరిగే ప్రాంతాలకు తరలిస్తారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలింగ్ కేంద్రాలతో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల దగ్గర వారిని మోహరిస్తారు.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
సుదీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ద్వారా తొలి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల అభ్యర్థులు, ప్రజలు ఫలితాల కోసం 42 రోజులు అయోమయంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, తొందరగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులకు ప్రచార ఖర్చుల భారం తగ్గుతుంది. ఆఖరి విడతల్లో పోటీపడే అభ్యర్థులు మండే ఎండల్లో వారాల తరబడి ప్రచార కార్యక్రమాలతో చెమటోడ్చాల్సి ఉంటుంది. ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది.


