గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
- 16 Views
- admin
- April 12, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఏపీలో దాదాపు 80 శాతం పోలింగ్——-
ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందంటున్న వైసీపీ———
సంక్షేమ పథకాల ప్రభావమంటున్న టీడీపీ————–
అమరావతి, ఫీచర్స్ ఇండియా: ఏపీలో దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. అంటే 2014తో పోలిస్తే, సుమారు 3 శాతం వరకూ అధికం. పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ‘పసుపు – కుంకుమ’, పింఛన్ల పెంపు, అమరావతి, పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ అంటుంటే, గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చెబుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతున్నాయి.
పోలింగ్ శాతం పెరగడం, మహిళలు, వయోవృద్ధులు ఉత్సాహంగా ఓటేయడం తమకు లాభిస్తుందని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో పోటీలో నిలబడిన అభ్యర్థులను చూడకుండా, తననే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని సీఎం చంద్రబాబు ప్రచారం చివర్లో విజ్ఞప్తి చేయడంపై సానుకూల స్పందన వచ్చిందని టీడీపీ చెబుతోంది.
ఇక, ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న కారణంగానే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని వైసీపీ చెబుతోంది. తమ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారని, ప్రత్యేక¬దా అంశంపై తాము మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నామన్న విషయం ప్రజలకు తెలుసునని వైసీపీ చెబుతోంది. బీజేపీతో నాలుగున్నరేళ్లు కలిసుండి, ఎన్నికలకు ముందు టీడీపీ ఆ పార్టీతో విడిపోయిందని, ఈ అంశాలన్నీ తమకు లాభిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
అధికారం మళ్లీ టీడీపీదే
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, 130 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో గురువారం అర్ధరాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టీడీపీ గెలవబోతోందని, ఈ విషయంలో రెండో ఆలోచన అవసరం లేదని తేల్చి చెప్పారు. 130 స్థానాల్లో పక్కాగా గెలుస్తామని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదన్నారు.
ఫలితాలు వచ్చే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు స్ట్రాంగ్ రూముల వద్ద 40 రోజులు షిఫ్టుల వారీగా కాపు కాయాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటలు దాటుతున్నా 200 బూత్‌లలో పోలింగ్ కొనసాగిందని, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు టీడీపీ వైపే నిలిచారన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు విధ్వంసాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.


