గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం
ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం కోవిడ్ నియంత్రణ, వైద్యరంగంలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పెళ్లిళ్ల సీజన్లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ విస్తరణకు దారితీసే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భవతుల తర్వాత టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడ కుండా చూడాలని సూచించారు.


