50శాతం రాయితీతో ఆప్కో వస్త్రాలు
విజయనగరం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): ఆప్కోలో అన్ని రకాల చేనేత వస్త్రాలపై 50శాతం రాయితీని అందజేస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ అధికారి గోపాలరావు తెలిపారు. ఆప్కో వాణిజ్య మండలి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆప్కో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అన్ని వస్త్రాలపై 50శాతం రాయితీ ప్రకటించడం ఇదే ప్రథమమన్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో 19 ఆప్కో చేనేత వస్త్ర దుకాణాలున్నాయని, వీటి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13.44 కోట్లు విలువ గల వస్త్రాలు అమ్మకాలు జరిపేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు రూ.99 లక్షల వస్త్రాలు అమ్మకాలు చేపట్టామన్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష్యానికి మించి అమ్మకాలు చేపడతామని వెల్లడించారు. అధునాతనమైన డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న రకాలైన జమదాని చీరలు, ఇక్కత్ వస్త్రాలు, మాధవరం, వెంకటగిరి చీరలు, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, చీరలు దుకాణాల్లో ఉన్నాయన్నారు. దసరా, దీపావళి సందర్భంగా ఈ ప్రత్యేక రాయితీని ఇస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కబడ్డీ క్రీడాకారిణిలకు విజయీభవ
విజయనగరం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): ఈ నెల ఆరు నుంచి నాలుగు రోజులు పాటు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో జరిగే రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ పోటీల్లో విజేతలుగా తిరిగిరావాలని శిక్షకులు తంగేటి భాస్కరరావు, లక్ష్మణరావులు అన్నారు. వారం రోజుల పాటు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ శిక్షణ శిబిరం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పోటీల్లో విజయం సాధించాలన్నారు. క్రీడాకారులకు జిల్లా కబడ్డీ సంఘం సంయుక్త కార్యదర్శి కనకల అప్పారావు టీ షర్టులను అందజేశారు. యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాము నిక్కర్లను అందించారు. కార్యక్రమంలో చైర్మన్ రంగారావుదొర, కార్యదర్శి కమలనాధరావు, కోశాధికారి కనకల ప్రసాద్, సర్పంచి, ఉప సర్పంచి తదితరులు పాల్గొన్నారు.
ఆశా కార్యకర్తల ధర్నా
విజయనగరం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు. జిల్లాలోని కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం మండలంలోని ఆశా కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తర్వాత రాష్ట్రవ్యాప్త నిరసనకు దిగుతామని సిఐటియు నేత లక్ష్మి తెలిపారు. కాగా, శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా విజయనగరం పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దేవీ విగ్రహాల వద్ద పూజాధికాలు ఊపందుకున్నాయి. మంగళవారంనాడు స్థానిక వనంగుడిలో పైడితల్లి అమ్మవారిని అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. భక్తులకు అమ్మవారు ఈ రూపంలో దర్శనం ఇవ్వడంతో వారు పోటెత్తారు. అదేవిధంగా పెద్ద చెరువు, షిర్డీసాయినగర్ తదితర ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి.


