60 పశువైద్య భవనాలకు ప్రతిపాదనలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): జిల్లాలో 60 పశు వైద్యశాలల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులువెంకటేశ్వరరావు తెలిపారు. పోలాకి మండలంలోని మబుగాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో భవనం రూ. 35 లక్షలతోనూ అలాగే సబ్‌సెంటర్ల ఏర్పాటునకు రూ. 15 లక్షలు అవసరమని ఇంజినీర్లు ఇచ్చిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపామన్నారు. జిల్లాలో పాడి పశువులకు అవసరమయ్యే గ్రాసం పెంచడానికి 220 ఎకరాలు గుర్తించినట్టు తెలిపారు.
ఒక్కో ఎకరాకి ఏడాదికి లీజు పద్ధతిలో రూ. 18 వేలు అందజేస్తామన్నారు. స్థానికంగా గ్రాసం పెంచే రైతులకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వర్షాధార భూములైతే ఎకరాకు రూ. 8,700 ఎంపీడీవో ఇస్తారన్నారు. ఏక వార్షిక పశుగ్రాసానికి రూ. 10వేలు, బహువార్షిక రకాలకు రూ. 31వేల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా అందుతాయన్నారు. నరసన్నపేట ఏడీ కార్యాలయం పరిధిలో రూ. 50 లక్షలతో పాడి రైతులుకు శిక్షణా భవనం నిర్మించామన్నారు. భవనం పనులు పూర్తి కాగా విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
పశువులకు సంబంధించి వ్యాధి నిర్ధరణ కేంద్రం (ల్యాబ్) కూడా రూ. 10 లక్షలతో నిర్మించారన్నారు. ఆసుపత్రికి కొత్తగా భవనానికి మరో రూ. 10 లక్షలు మంజూరయ్యాయని దీని నిర్మాణం కూడా చివరి దశలో ఉందన్నారు. నీటి సదుపాయం లేని భూమి ఉన్న రైతులు పశుగ్రాసం పెంచితే వారికి 75 శాతం రాయితీపై విత్తనాలు ఇస్తామన్నారు. జేడీతో పాటు స్థానిక వైద్యాధికారి ఆర్.ఆనందరావు కూడా ఉన్నారు.
ఉద్యోగాల పేరిట గిరిజనులకు కుచ్చుటోపీ
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఉద్యోగ వేటలో ఉన్న గిరిజన యువత ఆశలను తమకు అనుకూలంగా మార్చుకుని బెంగళూరుకు చెందిన రామానుజనప్ప అనే వ్యక్తి భారీగానే కుచ్చుటోపీ పెట్టారు. జిల్లాలోని సీతంపేట మన్యంకు చెందిన ఓ గిరిజన యువకుడిని మధ్యలో ఉంచి రెండేళ్ల కాలంలో సుమారు రూ. 30 లక్షల వరకు సుమారు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా రైల్వేలో క్లరికల్, ఎల్డీసీ, యూడీసీ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి మూడేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సీతంపేటకు మండలానికి 9 మంది గిరిజనలు తెలిపారు. ఎర్రన్నగూడకు చెందిన ఓ గిరిజన యువకుడి ద్వారా వ్యవహారం నడిపారని, తాము డబ్బులు ఇచ్చిన తర్వాత నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారని, న్యూదిల్లీలో శిక్షణ ఉంటుందని, విశాఖ, ముంబాయి తదితర ప్రాంతాల్లో ప్లేస్మెంట్లు ఉంటాయని తెలియజేశారని తెలిపారు. శిక్షణ ఆర్డర్ అంటూ ఇచ్చిన పత్రాలు నకిలీవని గుర్తించామని, దీంతో చేసేది లేక గత నెల 31న పాలకొండ డీఎస్పీ దృష్టికి సమస్య తీసుకువెళ్లామని చెప్పారు. రామానుజనప్పతో మాట్లాడితే మళ్లీ ఒక్కొక్కరు రూ. 12,000 పట్టుకున్న రమ్మని చెప్పడంతో ఈ నెల 1వ తేదీన పోలీసులతో కలిసి బెంగళూరు వెళ్లి, అక్కడ రామానుజనప్పను పట్టుకున్నామని తెలిపారు. సివిల్ ఇంజినీర్‌గా అని చెప్పి తమ మోసంచేశాడని, ఉద్యోగం వస్తుందన్న ఆశగా లక్షలు ముట్టజెప్పామని, తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని బాధితులు కోరారు. ఈ విషయాన్ని సీతంపేట ఎస్సై వి.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం రామానుజనప్ప పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
మోసగించిన కేసులో తండ్రీకొడుకుల అరెస్టు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): నిరుద్యోగ యువతకు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లక్షల్లో రూపాయలు వసూలు చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన రామానుజప్ప, అతని తండ్రి నారాయణస్వామిలను అరెస్టు చేసినట్లు పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ తెలిపారు. సీతంపేట పోలీసుస్టేషన్లో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆంగ్లం కోచింగ్ నిమిత్తం బెంగుళూరుకి వెళ్లిన సీతంపేట మండలం ఎర్రన్నగూడకు చెందిన ఎస్.మల్లేశ్వరరావుకు కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లా రామలింగాపురానికి చెందిన రామానుజప్ప, అతని తండ్రి నారాయణస్వామిలు పరిచయం అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు మల్లేశ్వరరావు వద్ద కొంత డబ్బు తీసుకున్నారు. అతనితో పాటు కొత్తూరు, బత్తిలి, సీతంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని మరో 9 మంది నుంచి ఇదేవిధంగా రూ.16 లక్షల వరకు వసూళ్లు చేశారని డిఎస్పీ తెలిపారు. 2013 ఆగస్టు నుంచి ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఎంతకూ ఉద్యోగం రాకపోవటంతో మల్లేశ్వరరావుకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల నుంచి చివరి డబ్బులు వసూలు చేసేందుకు వచ్చిన వీరిద్దరిని పోలీసులు సీతంపేట వారపు సంత మైదానం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వీరిని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు కొత్తూరు సీఐ శ్రీనివాసరావు, సీతంపేట ఎస్సై శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.


