ఆటగాళ్లు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలి

 

‘క్రికెట్‌ ఆడేటప్పుడు బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాళ్లు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలని క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశారు. 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌలర్‌ విసిరిన బంతి హెల్మెట్‌ కింద.. మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్‌.. రెండు రోజులు ఆసుపత్రిలో పోరాడి మరణించాడు. అది క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గతేడాది ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా తటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత ఆటగాడు రిషబ్‌ పంత్‌ (కాంకషన్‌) కూడా స్వల్పంగా గాయపడ్డాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కూడా భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడ్డాడు. అక్టోబర్‌ 24వ తేదీన కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో ఉన్న విజయ్‌.. పరుగు తీసే క్రమంలో పంజాబ్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ విసిరిన త్రో అతని మెడకు బలంగా తగిలింది. దీంతో విజయ్‌ తీవ్రమైన గాయంతో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయితే అదష్టవశాత్తు అతను హెల్మెట్‌ ధరించడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఆటగాళ్లు ప్రమాదాల పడడంపై తాజాగా సచిన్‌ ట్వీట్‌ చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ బౌలింగ్‌కు వస్తే బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌ ధరించడం.. స్పిన్నర్‌ బౌలింగ్‌కు వస్తే తీసేయడం చేస్తున్నారు. కానీ ఈ పద్దతిని మార్చాలి. బంతి వేసేది స్పిన్నరైనా, ఫాస్ట్‌ బౌలరైనా.. బ్యాట్స్‌మన్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించే నిబంధనను తీసుకురావాలి. హెల్మెట్‌ ఆటగాళ్లకు రక్షణగా నిలుస్తుంది. ఈ నిబంధనను తప్పనిసరి చేయకపోతే ఆటగాళ్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఇకపై స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ ఏదైనా సరే హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలనే నిబంధనను తీసుకురావాలని ఐపీసీని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *