ఒలింపిక్‌ విలేజ్‌లో తొలి కోవిడ్‌ కేసు

కరోనా వైరస్‌ కారణంగా గతేడాది జులైలో నిర్వహించాల్సిన ఒలింపిక్‌ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. కోవిడ్‌ నిబంధనల మధ్య క్రీడలను నిర్వహించాలని జపాన్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఒలింపిక్‌ విలేజ్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితి కొనసాగుతోంది. గత నెల రోజుల నుంచి కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. మరోవైపు, క్రీడలను నిలిపివేయాలంటూ జపాన్‌లో ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌ సమయంలో క్రీడలు నిర్వహించడం వల్ల మహమ్మారి వ్యాప్తికి మరింత దోహదం చేస్తుందని పలు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒలింపిక్‌ విలేజ్‌లో మొట్టమొదటి కోవిడ్‌ కేసు నమోదయినట్టు నిర్వాహకులు శనివారం వెల్లడిరచారు. ‘క్రీడా గ్రామంలోని ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది.. స్క్రీనింగ్‌ పరీక్షల్లో వెల్లడయ్యింది.. ఒలింపిక్‌ విలేజ్‌లో ఇదే తొలి కేసు’ అని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ అధికార ప్రతినిధి మసా టకాయా అన్నారు. ఈ మేరకు మీడియాతో సమావేశంలో తెలిపారు. బాధితుడి వివరాలను వెల్లడిరచడానికి నిరాకరించిన ఆయన.. అతడిని తక్షణమే గ్రామం నుంచి తరలించామని తెలిపారు. ప్రస్తుతం అతడు ఓ హోటల్‌లో ఉన్నాడని టకాయా పేర్కొన్నారు. టోక్యో క్రీడల కమిటీ అధ్యక్షుడు సెకో హష్మిటో మాట్లాడుతూ… ‘కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మేం ప్రతిదీ పక్కగా అమలు చేస్తున్నారు.. మహమ్మారి నియంత్రణపై ప్రతిస్పందించడానికి మాకు ఒక ప్రణాళిక ఉందని నిర్ధారించుకుంటాం’ అని వ్యాఖ్యానించారు. ఇక, యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశ్వ క్రీడా సంబరాలు మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో ఒలింపిక్‌ విలేజ్‌లో తొలి కోవిడ్‌ కేసు నమోదుకావడం కలకలం రేగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *