అధికారం కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్‌ కుట్ర

అధికారం కోసం జగన్‌ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని, దీనివల్ల దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడిరదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్‌ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని తన పత్రిక ‘ది ఆర్గనైజర్‌’లో ప్రచురించిన కథనంలో విమర్శించింది. జగన్‌ పాలనలో హిందూ వ్యతిరేక విధానాలు, అవినీతి, కులతత్వంపై బాహాటంగా విమర్శలు చేయడం వల్లే తమ పార్టీకే చెందిన ఎంపీ రఘురామరాజును అరెస్ట్‌ చేయించారని ‘ది ఆర్గనైజర్‌’ కథనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. చివరికి రఘురామ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు జోక్యంతో ఆయనకు ఊరట కలిగిందని తెలిపింది. ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి వేధింపులు జరగలేదని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారని, ఆ కాలంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించినట్టు ఆరోపణలు రాలేదని పేర్కొంది. ఎన్నో ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలున్న ఆంధ్రప్రదేశ్‌ను క్రిస్టియానిటీలోనికి తీసుకెళ్లే చర్యలకు పాల్పడటం దేశానికే ప్రమాదకరమని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. ఏపీలో జగన్‌ పాలన విధ్వంసకరంగా సాగుతోందని దుయ్యబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *