సర్వకళా వల్లభుడు… రెంటాల గోపాలకృష్ణ

రెంటాల గోపాలకృష్ణ… ప్రముఖ పత్రికా రచరుత, కవి, అనువాదకులు, నాటకకర్త. కవిగా, నాటకకర్తగా, రచరుతగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. వీరు గుంటూరు జిల్లా రెంటాల గ్రామంలో జన్మించారు. తెలుగునాట తొలితరం అభ్యుదయ కవితా వైతాళికులలో రెంటాల గోపాలకృష్ణ ఒకరు. ఆయన 1920వ సంవత్సరం సెప్టెంబర్‌ 5వ తేదీ, కృష్ణాష్టమి నాడు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామంలో జన్మించారు. పాండిత్యం, ప్రతిభ గల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచీ రెంటాలలో సాహిత్య సృజనాభిలాష ఎక్కువ. వివిధ గ్రంథాలు, పురాణాలు, శాస్త్రాలను అధ్యయనం చేశారు. సమకాలీన సాహిత్య, సామాజిక, రాజకీయ ధోరణులకు ఆయన స్పందించేవారు.

స్కూలు ఫైనల్‌ లో ఉండగానే 1936లో పదహేరేళ్ళ ప్రాయంలో ‘రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలను రాశారు. మిత్రుల సాయంతో 1939లో ప్రచురించి, సంచలనం రేపారు. ఈ చారిత్రక నవలకు ప్రముఖ పండితులు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు మారేమండ రామారావు ముందుమాట రాశారు. పాఠశాల ప్రాంగణంలో ఉండగానే రెంటాల ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకొని, వివిధ వృత్తాలు, గీతాలలో పద్యరచన చేశారు. 1937లో స్కూల్‌ ఫైనల్‌ వరకు నరసరావుపేటలోని మునిసిపల్‌ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఆనాడే ఏల్చూరి సుబ్రహ్మణ్యం, అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, గంగినేని వెంకటేశ్వరరావు లాంటి సాహితీ మిత్రుల సాహచర్యం రెంటాలకు సిద్ధించింది.

ప్రముఖ కవి – ప్రధానోపాధ్యాయుడు నాయని సుబ్బారావు శిష్యరికం అబ్బారు. తరువాత గుంటూరులోని కళాశాలలో బి.ఏ. (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. కళాశాలలో చదువుకుంటూనే ఈ సాహితీ మిత్రులంతా కలసి, నరసరావుపేటలో ‘నవ్యకళాపరిషత్‌’ అనే కవిత్వ, సాహితీ చర్చ వేదికను ప్రారంభించారు. ఆ రోజుల్లోనే సాహితీ చర్చలు జరుపుతూ, నవ్యకవితా ధోరణికి నాంది పలికారు. 1943లో రెంటాల విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మార్క్సిజమ్‌ అధ్యయనం, శ్రీశ్రీతో సన్నిహితత్వం, అభ్యుదయ సాహిత్యోద్యమం – వీటితో ఆయన రచనల్లో నూతన దృష్టి మొదలైంది. 1943లో ఆంధ్ర అభ్యుదయ రచరుతల ప్రథమ మహాసభ జరిగాక వెలువడిన తొలి అభ్యుదయ కావ్యం ‘నయాగరా’.

అభ్యుదయ కవితా ఉద్యమానికి మేనిఫెస్టోగా చెప్పదగిన ‘నయాగరా’ కవితా సంపుటి ప్రచురణలో రెంటాల సహాయకుడిగా పాలుపంచుకొన్నారు. ఏల్చూరి, కుందుర్తి, బెల్లంకొండలకు చేదోడువాదోడుగా ఉన్నారు. అలా ‘నయాగరా’ కవి మిత్ర బృందంలో ముఖ్యుడిగా నిలిచారు. మిత్రులతో కలసి తొలినాళ్ళలోనే అభ్యుదయ రచరుతల సంఘంలో చేరి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కొనసాగారు. ఉదరపోషణార్థం ఉద్యోగం చేయడం తప్పనిసరైనా, సాహిత్యాభిలాష కారణంగా రైల్వే, తదితర ప్రభుత్వ ఉద్యోగాలను రెంటాల కాలదన్నారు. 1942 ప్రాంతంలో కొంతకాలం చల్లా జగన్నాథం గారి సంపాదకత్వంలోని ‘దేశాభిమాని’ పత్రికలో గుంటూరులో పనిచేశారు.

చదలవాడ పిచ్చయ్య సంపాదకత్వాన వెలువడిన ‘నవభారతి’ మాసపత్రికలో మరికొంతకాలం కర్తవ్యనిర్వహణ చేశారు. అనంతరం 1960 ప్రాంతంలో అవసరాల సూర్యారావు, బెల్లంకొండ రామదాసు లాంటి మిత్ర రచరుతలతో కలసి నీలంరాజు వెంకట శేషయ్య గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో ఉపసంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆనాటి నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు అదే సంస్థలో వివిధ స్థాయుల్లో ఉద్యోగ నిర్వహణ చేశారు. ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదక మండలి సభ్యుడిగా గురుతర బాధ్యతలు నిర్వహించారు. పాత్రికేయ వృత్తిలో ఉంటూనే, ‘పంచకల్యాణి – దొంగల రాణి’, ‘కథానాయకురాలు’ లాంటి కొన్ని చలనచిత్రాలకు రెంటాల మాటలు, పాటలు సమకూర్చారు.

‘ఆంధ్రప్రభ’దినపత్రికలో సినీ విశేషాల వారం వారీ అనుబంధం ‘చిత్రప్రభ’కు నిరంతరాయంగా సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. కొత్త సినిమాలపై వారం వారం ఆయన రాసే సమీక్షలు పాఠకులకు ఆసక్తికరమయ్యారు. సుప్రసిద్ధ సినీ విమర్శకుడిగా ఆయనకు పేరు తెచ్చారు. సినీ – సాంస్కృతిక రాజధానిగా వెలిగిన విజయవాడలో అప్పట్లో జరిగే సినిమా సమావేశాలు, కార్యక్రమాల్లో గురుపీఠం రెంటాల గారిదే. పత్రికా రచనలో భాగంగా ఆయన సాంస్కృతిక, జ్యోతిష, కళా రంగాలపై ఎన్నో వ్యాసాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన సంపాదకీయాలు కూడా కోకొల్లలు. యాంత్రికంగా, గడియారం వంక చూసుకుంటూ మొక్కుబడిగా పనిచేసే చాలామంది జర్నలిస్టులకు రెంటాల భిన్నమైన వారు.

నిబద్ధతతో, నిర్దేశిత పని గంటల సమయానికి అతీతంగా నిరంతరం శ్రమించేవారు. తనదైన శైలిలో దగ్గరుండి ఎడిషన్‌ వర్కును పూర్తి చేరుంచేవారు. జర్నలిస్టుగా రెంటాలకున్న ఆ విశిష్ట గుణం ఆ తరం పాత్రికేయులకు సుపరిచితం. పత్రికా రచనను చేపట్టినప్పటికీ, రెంటాల తన సాహితీ సేద్యాన్ని ఏనాడూ ఆపలేదు. ‘అభ్యుదయ’, ‘మాతృభూమి’, ‘సోవియట్‌ భూమి’, ‘ఆనందవాణి’, ‘విజయవాణి’, ‘విజయప్రభ’, ‘నగారా’ లాంటి ఆనాటి ప్రముఖ పత్రికలలోనూ, ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రిక, ‘ఆంధ్రజ్యోతి’ దిన, వార పత్రికల్లోనూ, ‘స్వాతి’ వార, మాసపత్రికల్లోనూ, ‘బాలజ్యోతి’ పిల్లల మాసపత్రికలోనూ రెంటాల రచనలు, ధారావాహికలు అనేకం ప్రచురితమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *