అర్హులైన దళితులకు సత్వరమే ధ్రువీకరణ పత్రాలు

కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): షెడ్యూల్డ్‌ కులాలు, తెగలవారికి కుల ధృవీకరణ పత్రాలు విచారణ చేసిఅర్హులైన వారికి అందజేయడానికి సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని తూర్పు గోదావరి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ విధాన గౌతమీ సమావేశపు హాలులో జిల్లా ట్రైనింగ్‌ సెంటర్‌ వారు ఏర్పాటు చేసిన షెడ్యూల్డ్‌ తెగలవారికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు పై ఏర్పాటు చేసిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో జేసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో వాల్మీకి, కొండకాపు, గౌడ, ఎరుకుల, మేదర, కోయ కులాలైన గిరిజనులు, ఎస్సిలో బుడద, జంగం కులం వారికి కుల ధృవీకరణలో కొంత ఇబ్బందిగా ఉన్నందున గిరిజన సంక్షేమ శాఖ వారు ఆదేశాల మేరకు మంజూరు చేయాలన్నారు. గిరిజనుల భాషా, సంస్కృతి, ఆచారాలు మైదాన ప్రాంతాల వారితో పోల్చితే వేరుగా ఉంటాయని, వారి ఆచార, వ్యవహారాలు పరిశీలించి, విచారణ చేసి, కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలన్నారు.

సబ్‌ ప్లాన్‌ ప్రాంతాలైన శంఖవరం, కోటనందూరు, ఏజెన్సీ అడ్డతీగల ప్రాంతాలల్లో కొండరెడ్డి, కొండకాపు వారికి ధృవీకరణ పత్రాల మంజూరులో రెవెన్యూ ఉద్యోగులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. ఒక్కో ప్రాంతంలో గిరిజనుల కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి తెల్సుకోవాల్సిన అవసరం ఉందని, సదరు పత్రం మంజూరు చేసేటప్పుడు ఓటర్‌ జాబితా, ల్యాండ్‌ రికార్డ్‌ ఆధారాలు చూసుకుని, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఏజెన్సీలో తండ్రి లేదా తల్లి కులములు పరిగణలోకి వస్తుందని, కులాంతర వివాహాలు చేసుకున్న వారు ఎక్కువ కులము వారైనప్పటికీ, తక్కువ కులం వారిని చేసుకుంటే అదే పరిగణలోకి వస్తుందన్నారు. మతం మార్పిడి చెందినప్పుడు, ముందు మతంలో ఉన్న పండుగలు, ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారోలేదో పరిశీలించాలన్నారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నచోట, వారి ఆచార వ్యవహారాలు ప్రాధాన్యత సంతరించుకుని ఉంటాయని, వాటిని పరిగణలోకి తీసుకుని, శిక్షణ తీసుకున్న మీరు కుల ధృవీకరణ పత్రం మంజూరులో మెళుకువతో వ్యవహరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్‌కలక్టర్‌ రవి పఠాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృధ్ధి ఫలాలు ఎస్‌సి, ఎస్‌టి వారికి అందడానికి కుల ధృవీకరణ పత్రం ఎంతో ముఖ్యమని, దీని మంజూరులో గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మంజూరు చేయాలన్నారు. కుల ధృవీకరణ పత్రం మంజూరుకు తీసుకోవల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ఆదేశాలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. జిల్లా ట్ర్రైనింగ్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌విఎస్‌ సూరపు రాజు మాట్లాడుతూ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో కుల ధృవీకరణ పత్రాల మంజూరు ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, షెడ్యూల్‌ కులాలు, తెగల వారికి మంజూరు చేసే ధృవ పత్రాలు ఏ రకంగా మంజూరు చేయాలి, తప్పుడు ధృవపత్రం ఉంటే ఏ విధంగా విచారణ చేపట్టాలనే విషయాలు ఈ శిక్షణలో తెలియజేయడం జరిగిందన్నారు.

రెవెన్యూ, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారుల వారికి శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులలో నైపుణ్యం పెంచడానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఫలాలు అర్హులైన వారికి అందించడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే వారికి పూర్తి అవగాహన కల్పించడానికి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా శిక్షణా సంస్ధను ఒక హబ్‌గా తయారు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్‌ ఆప్టింగ్‌ ట్ర్రైనింగ్‌పై ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్లు, విద్యార్ధుల సమన్వయంతో నైపుణ్యం పెంచడానికి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ అధికారులను ఏడు గ్రూపులుగా విడదీసి ట్ర్రైబల్‌కల్చర్‌ టైఅప్‌ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.

బుర్రకధ, నాట్యం వీరనాట్యం, కోలాటం, బాణాలు, కోయనృత్యం, తదితర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి గిరిజనులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి, ట్రైనింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి మురళీకృష్ణ, తహశిల్దార్లు, ట్ర్రైబల్‌ వెల్ఫేర్‌, సాం ఘిక సంక్షేమం, బిసి వెల్ఫేర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *