ప్రాధాన్యతారంగాల అభివృద్దిపై కలెక్టర్ సమీక్ష

ఏలూరు, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో రబీలో శివారు ప్రాంత భూములకు కూడా సేద్యపునీరు అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్‌ ఇరిగేషన్‌, వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరు కార్యాలయంలో బుధవారం ప్రాధాన్యతారంగాల అభివృద్దిపై ఆయన సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతీ కాల్వ పరిధిలో సబ్‌ ఛానల్స్‌ నుండి పంటబోదెల వరకూ సేద్యపునీరు వెళ్లడానికి ఎటువంటి ఆటంకాలుండకూడదని నేటినుండి వచ్చే మంగళవారం వరకూ వ్యవసాయ, ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో క్షేత్రస్ధాయిలో పంటకాల్వలు, పంటబోదెలను స్వయంగా తనీఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పంటపొలాలకు సమృద్ధిగా సేద్యపునీరు చేరాలని శివారుప్రాంతంలో ఉన్న ప్రతీ అంగుళం భూమికి సేద్యపునీరు అందించాలన్నదే ప్రభుత్వోద్ధేశ్యమని సేద్యపునీరు వెళ్లడానికి ఎక్కడైనా చేపలచెరువులు అడ్డువస్తే తొలగించాల్సిందేనని ఈవిషయంలో రాజీలేదని రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అధికారులు పనిచేయాలని సేద్యపునీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయనే మాట పశ్చిమలో వినపడడానికి వీల్లేదని భాస్కర్‌ స్పష్టం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి 3వ పంట పండించడానికి రంగం సిద్ధం చేయడం జరిగిందని రబీపంట ముందుగానే వేసి 3వ పంటకు రైతులను చైతన్యపరచాలని 3 లక్షల ఎ కరాలలో పెసలు, మినుమలు పండించడానికి అవసరమైన విత్తనాలను ఇప్పటినుండే సిద్ధం చేయాలని వసాయాధికారులను ఆదేశించారు. 3వ పంటకు కాల్వలు మూసివేసేముందు ఒకతడి నీటిని అందిస్తామని రెండవ తడి క్రింద ఏప్రిల్‌లో నీరందించడానికి అవసరమైన రైయిన్‌గన్‌లను సిద్ధం చేయాలని కలెక్టరు చెప్పారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న రైయిన్‌గన్స్‌ వివరాలను సేకరించాలని తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో వాటర్‌ టాంకర్ల వివరాలను కూడా సేకరించి ఏప్రిల్‌లో 3వ పంటకు 2వ తడినీటిని రైయిన్‌ గన్స్‌ ద్వారా సమకూరుస్తామని కలెక్టరు చెప్పారు. జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుచేసి పండించిన పశుగ్రాసాన్ని అవసరమైన రైతులకు కేజీ 1 రూపాయికే అందించేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ జేడి జ్ఞానేశ్వరరావును కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో ఇ-పాస్‌ ద్వారా ఎరువులు, పురుగుమందులు అందించాలని ఎక్కడైనా మిషన్లు పనిచేయకపోతే వెనువెంటనే టెక్నికల్‌ సిబ్బందితో బాగుచేయించి ఫర్టిలైజర్లను విక్రయించాలేగానీ మాన్యువల్‌గా అందించడానికివీల్లేదని కలెక్టరు చెప్పారు. ప్రతీ ఇ-పాస్‌ మిషన్‌ వద్ద టెక్నికల్‌ సిబ్బంది ఫోన్‌ నెంబర్లను స్టిక్కర్‌ తో అతికించాలన్నారు. మొదటిలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమని వచ్చిన ఇబ్బందులను తొలగిస్తూ చేపట్టిన కార్యక్రమం సజావుగాజరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణఅర్హతకార్డులు అందించారు అందులో ఎంతమందికి రుణాలు ఇచ్చారో వివరాలను అందజేయాలని ఎ ల్‌డియం సుబ్రహ్మణ్యేశ్వరరావును కలెక్టరు ఆదేశించారు. అర్హతగల ప్రతీరైతుకూ రుణాలందించి ఆదుకోవాలని రుణాలిచ్చే సమయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సాధ్యమైనంత త్వరగా రుణాలందించాలని కలెక్టరు చెప్పారు. ఈసమావేశంలో అడిషినల్‌ జేసి షరీఫ్‌, సిపిఓ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడి సాయిలక్ష్మీశ్వరి, యల్‌డియం యం. సుబ్రహ్మణ్యేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జేడి డాక్టర్ జ్ఞానేశ్వర్‌, మార్క్‌ ఫెడ్‌ జిల్లా మేనేజరు కుమారి నాగమల్లిక, ఫిషరీస్‌ డిడి జాకబ్‌ భాషా, ఉద్యానవనశాఖ ఏడిలు దుర్గేష్‌, విజయలక్ష్మి, ఇతర ఉన్నత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *