ఉన్నత విద్యా వ్యవస్థకు దర్పణం ఆంధ్రవిశ్వవిద్యాలయం

  • సమాజ సేవే లక్ష్యం
  •  వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు

ఆంధ్రాయూనివర్శిటీ-ఫీచర్స్‌ ఇండియా: ఉన్నత విద్యా వ్యవస్థకు దర్పణంగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నిలుస్తుందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఉదయం ఏయూ వైవిఎస్‌ మూర్తిఆడిటోరియంలో నిర్వహించిన వర్సిటీ 92వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఏయూ చిహ్నం, వ్యవస్థాపక ఉపకులపతి సి.ఆర్‌ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసారు. అనంతరం మాట్లాడుతూ సమాజ సేవ, ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా వర్సిటీ పనిచేస్తోందన్నారు.

ఘనమైన చరిత్రను పదిల పరచుకుంటూ ఉన్నత భవిష్యత్తును దిద్దుకొనే దిశగా వర్సిటీ వడివడిగా అడుగులు వేస్తోంది.శతాబ్ధానికి చేరువవుతున్న వర్సిటీని మరింత సమున్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉంది. శతాబ్ధి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటిని ఏర్పాటుచేసి ఉత్సవ నిర్వహణకు పటిష్టంగా పనిచేస్తాం.విశ్వవిద్యాలయం ప్రగతిలో పూర్వవిద్యార్థుల మేధో సహకారాన్ని, తోడ్పాటును, భాగాస్వామ్యాన్ని అందుకునే విధంగా పూర్వవిద్యార్థుల సంఘాన్ని బలోపేతం చేయడం జరుగుతోంది. ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 10వ తేదీన పూర్వవిద్యార్థుల సమావేశం నిర్వహిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనకు విశ్వవిద్యాలయంలో అధిక ప్రాధాన్యం కల్పించడం జరుగుతోంది. దీనిలో భాగంగా 50 పడకలతో నూతన వైద్యశాల నిర్మాణం, క్రీడా హాస్టల్‌, జిమ్‌ నిర్మాణం ప్రారంభించి, త్వరిత గతిన పూర్తిచేయడం జరుగుతోంది. మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు , ప్రత్యేకంగా విద్యార్థినులకోసం 600 మంది నివసించడానికి వీలుగా నూతన హాస్టల్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. యువతను, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానంలో భాగంగా ఓపెన్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్మించడం జరుగుతోంది. విశ్వవిద్యాలయాన్ని దివ్యాంగులకు అనుకూలంగా మార్పుచేస్తూ వారికి అవసరమైన లిఫ్ట్‌లు, బ్యాటరీ వాహనాలు, హాస్టల్‌లో ఉచితంగా మెస్‌ సదుపాయాలను కల్పించడం జరుగుతోందని గుర్తుచేస్తున్నాము.

వర్సిటీలో చదువుకుంటున్న దివ్యాంగులు జాతీయ స్థాయి పోటీలలో సైతం అత్యుత్తమ ప్రతిభ చూపుతూ పతకాలు సాధించడం వర్సిటీకి ఎంతో గర్వకారణంగా నిలుస్తోంది.రానున్న కాలంలో విశ్వవిద్యాలయంలో పలు క్రీడా ప్రాంగణాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాము.ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే బ్యూటిఫికేషన్‌ చర్యలకు శ్రీకారం చుడుతున్నాము. ఎత్తైన కొండలు, సువిశాల సాగరం మధ్య నెలవైన వర్సిటీని మంరింత సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ప్రారంభించిన అకడమిక్‌ ఆడిట్‌ సత్ఫలితాలను అందిస్తోంది. ఇదే విధానాన్ని అనుబంధ కళాశాలలకు సైతం విస్తరించడం జరుగుతోంది. తద్వారా విద్యలో నాణ్యతను పెంపొందించడం సాధ్యపడుతుంది.

వర్సిటీకి అనుబంధంగా పనిచేస్తున్న కళాశాలల్లో బోధనలో నాణ్యత, నవ్యత ఉండటానికి కృషిజరుగుతోంది. దీనికి ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలను నియమించడం జరిగింది. వర్సిటీ కళాశాలలు ఫ్యాకల్టీ ర్యాటిఫికేషన్‌ జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి నిరంతరం విద్యార్థులకు, పరిశోధకులకు సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ అందించడం జరుగుతోంది. వర్సిటీ పరీక్షల విధానాన్ని పటిష్టం చేస్తూ ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్లలో భధ్రపరచడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.ప్రతిష్టాత్మకంగా నిలచే రక్షణ రంగాల ఉద్యోగులకు బోధన, పరిశోధన సహకారం అందిస్తూ, ఉద్యోగులకు ఉన్నత విద్యను అందించే దిశగా ఆంధ్రవిశ్వవిద్యాలయం చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి.

విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంపుదల చేయడం, విదేశీ మహిళా విద్యార్థినులకు ప్రత్యేక వసతి సదుపాయం(హాస్టల్‌) ఏర్పాటు చేసేదిశగా పనిచేస్తున్నాము.విశ్వవిద్యాలయంలో సెంటర్‌ ఫర్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.విశ్వవిద్యాలయం చరిత్రను, ఖ్యాతిని భవిష్యత్‌ తరాలకు అందించే దిశగా ఒక బృహత్‌ ప్రయత్నం చేయదలచాము. విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, మేధావుల సహకారంతో వర్సిటీ చరిత్రను గ్రంధస్థం చేయనున్నాము. దీనికి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో ప్రారంభించడం జరుగుతుంది.

వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపనకు కృషిచేసిన ఏపి పాత్రో కృషిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ వర్సిటీని ముందకు నడిపించాలన్నారు. ఇప్పటి వరకు 16 మంది ఉపకులపతులు వర్సిటీకి తమ సేవలను అందించడం జరిగిందని, వర్సిటీ శతాబ్ధి ఉత్సవాలను ఘనంగానిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

అనంతరం ఇథియోపియాకు చెందిన జిగ్‌జిగా వర్సిటీ వీసీ డాక్టర్‌ అహ్మద్‌ అరబ్‌ ఎడెన్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంతో తమ అనుబంధం కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, అకడమిక్‌ డీన్‌ ఆచార్య కె.నిరంజన్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య జి.శశిభూషణ రావు, ప్రిన్సిపాల్స్‌ డి.ఇ బాబు, డి.గౌరీ శంకర్‌, టి.సుబ్రహ్యణ్యం, ఎం.ఎస్‌ ప్రసాద బాబు, ఆటా అద్యక్షుడు జాలాది రవి, ఏయూఇయూ అద్యక్షుడు జి.వి రవికుమార్‌లు పాల్గొన్నారు. అనంతరం 8మంది ఆచార్యులు, 13 మంది బోధనేతర సిబ్బందిని వర్సిటీ తరపున సత్కరించారు. వర్సిటీలో విశిష్ట సేవలు అందించిన పదవీ విరమణ చేసి 80 సంవత్సరాలు వయసు కలిగిన వారికి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *