సామాన్యుడి విమానం ఉడాన్
- 14 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు
విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తేవటమే ఉడాన్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్(ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని మోదీ గురువారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సిమ్లా-దిల్లీ మార్గంలో నడిచే తొలి ప్రాంతీయ విమాన సేవలను మోదీ జెండావూపి ప్రారంభించారు. దీంతో పాటు కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్‌కు విమాన సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజల అభిలాష తీర్చేందుకే ఉడాన్ విమాన సేవలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. దేశంలో చిన్న, మధ్య తరహా విమానాశ్రయాల అనుసంధానానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతుందని.. ఉడాన్ సర్వీసుల్లో కిలోమీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు మాత్రమే ఉంటుందని మోదీ తెలిపారు. ఉడాన్ సర్వీస్‌లో గంటలోపు ప్రయాణానికి రూ.2,500 ఖర్చవుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న టైర్-2, టైర్-3 నగరాలకు విమాన సేవలు అందిస్తే ప్రయోజనం కలుగుతుందని మోదీ తెలిపారు.


