-జయ బంగ్లా సెక్యూరిటీ గార్డు హత్య కేసులో మరో మలుపు
-ఒకే రాత్రి రోడ్డు ప్రమాదాల బారిన పడిన ఇద్దరు నిందితులు
-ప్రధాన సూత్రధారి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కోయంబత్తూర్, ఏప్రిల్ 29: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు చెందిన కొండనాడు టీ ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డు హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎస్ కనకరాజు శుక్రవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి స్నేహితుడు, ఈ కేసులో మ రో నిందితుడు శ్యామ్ కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు ఒకేరాత్రి కొన్ని గంట ల వ్యవధిలో జరుగడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీ రాత్రి నీలగిరి సమీపంలోని జయలలిత ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్‌కు చెందిన ఓమ్ బహదూర్ హత్య, దోపిడీ కేసులో కనకరాజు కీలక సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సాలెం జిల్లా అతూర్లో కనకరాజు (36)నడుపుతున్న బైక్‌ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని పోలీసులు అత్తూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కనకరాజ్ సన్నిహిత మిత్రుడు సాయన్ అలియాస్ శ్యామ్ శనివారం తెల్లవారుజామున కారులో కుటుంబంతో కలిసి త్రిసూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా లారీ వీరి కారును ఢీకొట్టింది. పాలక్కడ్-త్రిసూర్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదంలో శ్యామ్ భార్య వినుప్రియ, కూతురు నీతు అక్కడికక్కడే చనిపోయారు. శ్యామ్ తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శ్యామ్ నుంచి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్ సెంథిల్‌కుమార్ వాంగ్మూలం తీసుకున్నారు. 2012 వరకు జయలలిత కారు డ్రైవర్‌గా కనకరాజు పనిచేశారు. నీలగిరికి సమీపంలోని టీ ఎస్టేట్ బంగ్లాకు జయలలిత తరచూ వెళ్లేవారు. ఆ బంగ్లాలో జయలలితకు సంబంధించిన కీలకపత్రాలు ఉంటాయని, వాటిని ఎత్తుకురమ్మని ఏప్రిల్ 24 రాత్రి కొందరు రెండు సుమో వాహనాల్లో పది మందిని పురమాయించినట్టు పోలీసులు అనుమానించారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ రాత్రి బంగ్లాకు చేరుకున్న దుండగులు సెక్యూరిటీ గార్డును హత్యచేసి, మరొకరిని తీవ్రంగా గాయపరిచి కీలకపత్రాలు ఎత్తుకెళ్లారు. జయ అక్రమ ఆస్తు ల కేసులో ఈ బంగ్లా ప్రస్తావన కూడా ఉన్నది. ఈ కేసులో జయలలిత, శశికళతోపాటు పలువురు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.