ఖరారు కాని టీడీపీ యలమంచిలి సీటు
- 9 Views
- admin
- February 25, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రచారంలో వైెసీపీ కన్నబాబు, జనసేన సుందరపు————
గత రెండు ఎన్నికలల్లోనూ తేడా నాలుగైదువేలు ఓటర్లే——————–
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: యలమంచిలి నియోజక వర్గంలో బైట వాతావరణం లాగానే రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. తెలుగుదేశం అభ్యర్ధి ని ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైకాపా మాత్రమే ఇప్పటికి కన్నబాబురాజుని అభ్యర్ధిగా ప్రకటించింది. మిగిలిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇంకా అభ్యర్ధుల్ని ప్రకటించలేదు. అయినా జనసేన తరపున సమన్వయకర్త సుందరపు విజయకుమార్ ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిచోటా రాజకీయ చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సమన్వయకర్తగా కన్నబాబురాజు వైసీపీ రంగప్రవేశం చేసిననాటి నుంచీ తనదే సీటు అంటూ గ్రామా గ్రామానికీ తిరిగి ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గం అంతా కలయతిరిగి విజయోత్సవ సభ కూడా నిర్వహించారు. దానికి ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్ లాంటి వారిని రప్పించి ఆర్భాటంగా బహిరంగ సభ నిర్వహించారు. కన్నబాబు రాజుకు ఎట్టి పరిస్థితిల్లోనూ సీటు రానివ్వకుండా అడ్డుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన బొడ్డేడ ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు తలదించుకొనే పరిస్థితి ఏర్పడింది. కన్నబాబుకు సీటిస్తే ఓడిస్తామని వీరు బహిరంగ ప్రకటనలు చేసినా అధిష్టానం ఖాతరు చేయలేదు. కన్నబాబు రాజుకే సీటు ఖరారు చేసింది. ఇలాంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగాలా మరో పార్టీలో చేరిపోవాలో అర్ధంకాని సంకట స్థితిలో ఇద్దరూ పడ్డారు. వీరిద్దరి మాటా అధిష్టానం పట్టించుకోకపోవడానికి కారణం ఆర్ధిక స్థితిగతులే అన్న లోగుట్టు బట్టబయలైంది. సీనియర్ నేతలంతా కన్నబాబు వైపే మొగ్గుచూపడంతో సీటు సునాయాసంగా కేటాయించారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రగడ నాగేశ్వరరావు వైసీపీలో ఇమడలేక తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారని బోగట్టా. అయితే పంచకర్ల విశాఖ ఉత్తరానికి ఖరారైతే యలమంచిలి సీటు కేటాయించడానికి స్థానిక నేతలు సిద్ధమైనా ఖర్చు విషయంలో తెలుగుదేశం నాయకులు అనుకున్నంత తేలేనంటూ చేతులెత్తేయడంతో ప్రగడ పార్టీ ఫిరాయింపు ఆగిపోయినట్టు తెలిసింది.నియోజకవర్గ ప్రజల్లో మాత్రం ప్రగడకు మంచి ఫాలోయింగ్, సానుభూతి ఉందన్నది కాదనలేని సత్యం. ఇక కన్నబాబు రాజు విషయానికొస్తే కేవలం అనుకున్నది సాధించే వరకూ అహర్నిశలు కష్టించే తత్వం ఆయనది. ఏ మాయ చేసైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నది ఆయన ఆలోచన. ఆ సమయంలో అనుకున్నది సాధించడానికి సామదానదండోపాయాలను సైతం అమలు చేయడానిక సంసిద్ధుడన్న పేరుంది. అయితే దుందుడుకు రాజకీయం ఆయనకు కీడు కూడా చేస్తోంది. అదే మైనస్‌గా కూడా చెప్పుకుంటున్నారు. కన్నబాబురాజు 2009లో పదివేల ఓట్ల ఆధిక్యంతో ప్రజారాజ్యం అభ్యర్ధి గొంతిన నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం తరపున అభ్యర్ధిగా దిగిన లాలం భాస్కరరావు మూడోస్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2014లో కన్నబాబురాజు తెలుగుదేశం మద్దతు పలికి సీటు కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఇస్తానన్న ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకపోవడంతో తిరిగి ఇప్పుడు వైకాపా తీర్ధం పుచ్చుకొని అభ్యర్ధిగి నిలిచారు.
2015లో బీజేపీ పొత్తు కారణంగా ఉత్తరంలో విఫలమై పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి నియోజకవర్గంలో పోటీచేయాల్సి వచ్చింది. నియోజకవర్గంలో విభేదాలు లేకుండా అందరి సహకారం తీసుకొని వైసీపీ అభ్యర్ధి ప్రగడ నాగేశ్వరరావుపై 8,375 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానపోటీ తెలుగుదేశం, వైకాపా ల మధ్యేనని భావిస్తున్నారు. అయితే జనసేన పార్టీ దక్కించుకొనే ఓట్ల శాతాన్ని బట్టి ప్రధాన పార్టీల విజయం ఆధారపడి ఉంటుందంటున్నారు. అది కూడా కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాలతోనే విజయావకాశాలు చేరువవుతాయని పరిశీలకుల అంచనా.
ప్రస్తుతం నియోజక వర్గంలో లక్షా ఎనభైవేల ఓట్లున్నాయి. వీటలో కొత్తగా చేరిన వారు సుమారు పది వేల మంది ఉన్నారు. వీరిలో అధికశాతం ఎటువైపు మొగ్గుచూపితే వారే విజయం సాధిస్తారని లెక్కలు వేస్తున్నారు. స్థానిక అభ్యర్ధికాకపోతే తెలుగుదేశం వెనుకంజలో ఉంటుందని వైకాపా భావిస్తోంది. అదే తరుణంలో పార్టీ సంక్షేమ పథకాలే విజయదన్నుగా ఉంటుందని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. అభ్యర్ధులు ఖరారైతే మరింత స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది.


