ఉత్తరంలో గంటా విస్తృత ప్రచారం
- 10 Views
- admin
- March 20, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మాజీ కార్పొరేటర్ కొళ్లాబత్తులతో సహా 1500మంది టీడీపీలో చేరిక——————
21న నామినేషన్ వేయనున్న గంటా———————-
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా వార్డుల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న ఆయన బుధవారం 37వ వార్డు బాపూజీనగర్ తదితర ఏరియాల్లో ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. ఈ సందర్భంగా వార్డు మాజీ కార్పొరేటర్ కొళ్లాబత్తుల వెంగళరావుతో సహా 1500మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారందరికీ టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావులు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున ప్రజలు టీడీపీలో చేరుతున్నారన్నారు. మహిళలకు పసుపు-కుంకుమ కార్యక్రమం కింద ప్రతీ డ్వాక్రా మహిళకు రూ.10వేలు అందజేశామన్నారు. దీంతో పాటు గత ఎన్నికల ప్రచారంలో ప్రతీ మహిళకు రూ.10వేలు ఇస్తామన్న హామీని విడతల వారీగా నెరవేర్చామని గంటా చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబునాయుడును సీఎం గా చేసుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నానని, గత రెండుసార్లు అధికారానికి ఈ నియోజకవర్గం దూరమైందని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను గెలిపించుకుంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయన్నారు. ఎంతో మంది ఎన్నో ప్రగల్బాలు పలుకుతారని, రాజకీయాల్లో అవన్నీ నమ్మొద్దని పనిచేసే వారికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 21వ తేదీ ఉదయం 10గంటలకు ఉత్తర నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధిగా తాను నామినేషన్ వేస్తున్నానని, 10గంటలకు మాధవధార కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ నుంచి ర్యాలీ బయల్దేరుతుందని, మురళీనగర్, కప్పరాడ, నరసింహనగర్, పోర్టు స్టేడియం, సీతమ్మధార మీదుగా అర్బన్ తహశీల్దార్ కార్యాలయానికి ఈ ర్యాలీ చేరుకుంటుందని చెప్పారు. అక్కడ 11.30గంటలకు నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు.


